Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

దృఢ చిత్తం

తన సేవ పురోగతికి దేవుడు అద్భుత కార్యాలు చెయ్యడు. వ్యవసాయదారుడు భూమిని సాగుచెయ్యటం నిర్లక్ష్యం చేస్తే, దాని పర్యవసానాల్ని అధిగమించటానికి దేవుడు సూచక క్రియ చెయ్యడు. మనకు బయలు పర్చిన నియమాల ప్రకారం దేవుడు పని చేస్తాడు. దేవుడు నిశ్చితమైన ఫలితాల్ని ఇవ్వటానికి గాను జ్ఞానయుక్తమైన ప్రణాళికలు తయారు చేసుకుని, సాధనాల్ని సమకూర్చటం మనం నిర్వహించాల్సిన పాత్ర. ఎలాంటి నిర్ణయాత్మక కృషి చెయ్యకుండా, తమను చర్యకు పరిశుద్ధాత్మ ఒత్తిడి చెయ్యటానికి కని పెట్టేవారు చీకటిలో నశిస్తారు. మీరు దేవుని సేవలో పని చెయ్యకుండా కూర్చోకూడదు. సదర్న్ వాచ్ మేన్, డిసె. 1, 1903. ChSTel 267.2

మిషనెరీ సేవ చేస్తున్న వారిలో కొందరు బలహీనులు, పిరికివారు, చురుకుదనం లేనివారు అయి సులువుగా అధైర్యం చెందుతారు. ముందుకి వెళ్లలేరు. ఏదైనా చెయ్యటానికి శక్తినిచ్చే నిశ్చయాత్మక గుణలక్షణాలు ఉత్సాహం రగిలించే స్పూర్తి శక్తి వారి ప్రవర్తనలో ఉండవు. జయం సాధించేవారు ధైర్యం నిరీక్షణ కలవారై ఉండాలి. వారు సాత్విక లక్షణాల్నే గాక క్రియాత్మక లక్షణాల్నీ అలవర్చుకోవాలి. గాసిపుల్ వర్కర్స్ పు. 290. ChSTel 268.1

సిలువ విజయాల్ని ముందుకు నెట్టుతూ పురోగమించటానికి ప్రభువుకి పనివారు అవసరం. రివ్యూ అండ్ హెరాల్డ్, మే 6, 1890. ChSTel 268.2

వర్తమానాన్ని పిరికిగా, నిర్జీవ పదజాలంతో కాక స్పష్టమైన, నిర్ణయాత్మకమైన, కుదిపివేసే పదజాలంతో ప్రకటించాలి. టెస్టిమొనీస్, సం.8, పు. 16. ChSTel 268.3

ఈ వర్తమానం ప్రకటించటానికి ప్రావీణ్యం గల ఉపన్యాసకుడు అవసరం లేదు. సత్యాన్ని దాని కాఠిన్యం అంతటితో ఉచ్చరించాలి. సంఘాల్ని శుద్ది చెయ్యటానికి, లోకాన్ని హెచ్చరించటానికి చిత్తశుద్ధితో, అలుపెరుగని శక్తితో పనిచేసే క్రియాశూరులు అవసరం. టెస్టిమొనీస్, సం.5, పు. 187. ChSTel 268.4

దేవుని సేవలో సోమరులికి స్థానం లేదు. ఆలోచనపరులు, కరుణానురాగాలు గలవారు, శ్రద్దగా సేవ చేసేవారు అయిన పనివారిని దేవుని కోరుతున్నాడు. టెస్టిమొనీస్, సం.4, పు. 411. ChSTel 268.5